అనకాపల్లి,(ప్రజాముద్ర)న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా న్యాయవ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహి స్తారని, న్యాయవాదులు లేకుండా న్యాయస్థానాలు లేవని, న్యాయవాది తన వృత్తి ధర్మాన్ని అనుసరించి తనను ఆశ్రయించిన బాధితులకు న్యాయం చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడి చేసి న్యాయవాదులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, AP ఆదివాసి సంఘం గౌరవ సలహాదారు P.S. అజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అక్కడ పరిస్థితులు అటు న్యాయమూర్తులకు, ఇటు న్యాయవాదులకు, మారో వైపు కక్షిదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా న్యాయస్థానాలలోని మహిళా సిబ్బంది, మహిళా న్యాయవాదులు, మహిళా కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణం స్థలాన్ని కేటాయించి కోర్టుల సముదాయాన్ని నిర్మించవలసిన అవసరం ఉందని అజయ్ కుమార్ అన్నారు. దీనికోసం సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అనకాపల్లి
జిల్లా కేంద్రంలోని న్యాయస్థానాల సముదాయం వద్ద నిర్వహించిన నిరసనలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అన్ని రాష్ట్రాలలో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అనగా మార్చి 21న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చిందని ఆ సందర్భంగా సంఘ సభ్యులైన న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్లే కార్డ్స్ పట్టుకొని తమ నిరసన తెలియజేసారు.
2022 జూలై నెలలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ముసాయిదా న్యాయవాదుల రక్షణ బిల్లును తయారుచేసి రాష్ట్రాలలోని అన్ని ప్రభుత్వాలకు పంపించిందని సీనియర్ న్యాయవాది I.R. గంగాధర్ గుర్తు చేశారు. ఆ ముసాయిదా బిల్లు ఆధారం చేసుకుని రాజస్థాన్ మరియు కర్ణాటక రాష్ట్ర శాసనసభలో ఇప్పటికే చట్టాలను రూపొందించాయని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వెంటనే స్పందించి ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని అనకాపల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శేఖరమంత్రి సాయి లక్ష్మణరావు కోరారు. దళిత బహుజన సామాజిక వర్గాలు, ఆదివాసీలు, మహిళల నుండి న్యాయవాద వృత్తుల్లోకి వస్తున్న వారు తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారని, ఆర్థిక ఇబ్బందులకు కూడా లోను అవుతున్నారని ఈ రక్షణ చట్టం వారి యొక్క సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని యువ మహిళా న్యాయవాది శ్రీమతి చిట్టా జయశ్రీ అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం యొక్క అవసరాన్ని వివరిస్తూ సంఘం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బంధం వెంకటరమణ, ఐ.వి.ఎస్ ప్రసాద్ ,భూపతి,యువ న్యాయవాదులు అవినాష్ ఇళ్ల, గంటా సురేష్ , సానబోయిన కిషోర్ ,పిట్ల హరీష్, కొణతాల అరుణ మొదలగు వారు పాల్గొన్నారు.








