డా”బాబూ జగ్జీవన్ రామ్ జీవితం యువతకు స్ఫూర్తి కావాలి-జిల్లా కలెక్టర్

అనకాపల్లి ఏప్రిల్ 5: డా: బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. డా: బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సుగేంద్ర, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగభూషణం అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ 1908 సంవత్సరంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ లో షెడ్యూల్ కులంలో పుట్టి చదువే ఆయుధంగా చేసుకొని అత్యంత ఉన్నత స్థానానికి చేరారని, అనేక ఉన్నత పదవులు నిర్వహించి, దేశానికి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. స్వాతంత్ర సిద్ధించే నాటికి ఆహార కొరతతో ఉన్న భారతదేశం లో హరిత విప్లవం అమలు చేయడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేశారన్నారు. 1971లో రక్షణ శాఖ మంత్రిగా యుద్ధ సమయంలో కీలకపాత్ర పోషించి బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ముఖ్య భూమిక వహించారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీ సభ్యునిగా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించుటకు గాను రిజర్వేషన్లు అమలు చేశాడని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ కష్టపడి చదువుకొనుట ద్వారానే ఆ స్థాయికి చేరుకున్నారని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకొని వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అభిలసించారు. శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 1985 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారి ప్రభుత్వం సమయంలో అధికారిక కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారిని కలవడం జరిగిందని, అటువంటి మహానుభావుని కలుసుకోవడం తన అదృష్టమని తెలిపారు. మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సమాజానికి దశ దిశ నిర్దేశించారని తెలిపారు. రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించడం జరిగిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మిక హక్కులను కాపాడి, కార్మిక చట్టాలను రూపొందించి అమలు చేయడం జరిగిందని, నేడు కార్మికులు అనుభవిస్తున్న హక్కులు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంలో పుట్టి, కష్టపడి చదువుకొని ఉన్నత స్థానానికి చేరారని , ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణ, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సుగేంద్ర, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగభూషణం మాట్లాడుతూ డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం గూర్చిన విషయాలను తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. పరవాడ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ వసతి గృహం 9వ తరగతి విద్యార్థిని బి. ఇందులక్ష్మి డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం గూర్చి తెలియ జేయగా, వివిధ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎమ్. జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు, ఆర్డిఓ షేక్ ఆయిషా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని రాజేశ్వరి, ఇతర జిల్లా అధికారులు, షెడ్యూల్ కులాల, జాతుల సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు