విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు..

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ‌నివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో మూడు లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

 

విశాఖ నగరంలోని సుందరమైన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు విస్తరించిన సుదీర్ఘ మార్గంలో లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో వివిధ యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో, సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట, ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్‌లోని సూరత్‌లో నమోదైన రికార్డును ‘యోగాంధ్ర-2025’ అధిగమించడం విశేషం. ఈ భారీ జనసమీకరణతో గతంలో సూరత్‌లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది.

 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు