కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో జగ్గారెడ్డి ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే చాలా గొప్పగా ఉందని జగ్గారెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, వారి కృషి ఫలించాలంటే క్షేత్రస్థాయిలో పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

 

కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని, పార్టీ కార్యక్రమాల్లో సరైన గుర్తింపు ఇవ్వాలని జగ్గారెడ్డి పీఏసీకి సూచించారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే కార్యకర్తల ఆర్థిక, మానసిక మద్దతు చాలా కీలకమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారిని సంతృప్తి పరిచే చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. జగ్గారెడ్డి సూచనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు