ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేసి తీరుతాం.. ఏపీ సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

 

సుపరిపాలనలో తొలి అడుగు..

“అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, పంటలకు గిట్టుబాటు ధర, అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు మంజూరు, వాట్సప్‌ గవర్నెన్స్‌తో సుమారు 500 సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

 

కేంద్రం సహకరిస్తోంది..

కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏపీకి సహకరిస్తోందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. స్టీల్‌ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు