సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించనుంది.
సీఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బి. వెంకటేశ్వరరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి. ప్రతాప్‌కుమార్, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్ ఘుగేను నియమించారు. ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారాన్ని ఫ్యాక్టరీల డైరెక్టరేట్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలను గుర్తించడం, సిగాచి పరిశ్రమ యాజమాన్యం భద్రతా నియమాలను, నిబంధనలను పాటించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం ఈ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. దీంతో పాటు భవిష్యత్తులో రసాయన పరిశ్రమల్లో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పటిష్ఠమైన చర్యలపై ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేయాలని కమిటీని కోరింది.
మరోవైపు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదం జరిగిన పరిశ్రమను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.