బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌తో రహస్యంగా సమావేశమయ్యారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే, కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
ఈ భేటీ ఒకసారి కాదు, రెండుసార్లు జరిగిందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. “లోకేశ్‌ను కలవలేదని కేటీఆర్ ఖండిస్తే, ఆ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలను బయటపెడతాను” అని ఆయన సవాల్ విసిరారు. తెరవెనుక ఏం జరుగుతుందో ఈ సమావేశాలతోనే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడంపై సామ మండిపడ్డారు. రైతుల సంక్షేమంతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు సోమవారం అమరవీరుల స్థూపం వద్దకు రావాలని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని బీఆర్ఎస్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.