ఖాజాగూడ కబ్జా కేసులో కీలక మలుపు..!

ఖాజాగూడలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జారాయుళ్ల చెరనుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నడుంబిగించారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహించడంతో.. ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు. కబ్జా స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి.. ఈమేరకు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రతివాదులకు నోటీసులు పంపించింది. విచారణను రెండువారాలపాటు వాయిదా వేసింది.

 

అసలేం జరిగింది..?

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని ఖాజాగూడ చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌(FTL) పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. 27.18 ఎకరాల ఈ ప్రభుత్వ భూమిలో ఇటీవల అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ భూమి కబ్జా వెనక పెద్ద స్టోరీనే నడిచింది. ఈ భూమికి ఉన్న పాత సర్వేనెంబర్లు 119, 122 కాగా.. వాటిని సవరించి కొత్తగా 27 సర్వే నెంబర్ ఇచ్చారు. 1995లోనే డీఆర్వో ఉత్తర్వులు ఇవ్వగా.. వాటికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌ సదరు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పార్టీలకు కేటాయించారు. నేరుగా కలెక్టర్‌ ఎన్‌వోసీ ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ కూడా తదనుగుణంగానే స్పందించింది. అక్కడ భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసింది. ఇక్కడ రెవెన్యూ, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీలోని కొందరు అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని అంటున్నారు. ఈ ప్రాపర్టీని పొందిన బెవర్లీ హిల్స్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, బండి బిందు.. బి.సుబ్బారెడ్డి అనే వ్యక్తికి డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ చేశారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా జారీ చేశారు. దీంతో అక్కడ సుబ్బారెడ్డి 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ లో 47 అంతస్తులు ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలంటూ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించారు.

 

హైడ్రాతో ఫిర్యాదు చేసినా..

హైకోర్టుని ఆశ్రయించే ముందు ఎమ్మెల్యేలు నలుగురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అయితే హైడ్రా ఈ విషయంలో చురుగ్గా లేదని, తమ ఫిర్యాదుని పట్టించుకోలేదని వారు కోర్టుకి తెలిపారు. అందుకే తాము కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని, ఇక్కడ తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఏవీ లేవని స్పష్టం చేశారు. ఈ భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతివాదులతో కుమ్మక్కయ్యారని, కబ్జా చేసిన భూమిలో యధేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ నిర్మాణ స్థలానికి సమీపంలోనే ఓక్రిడ్జ్ స్కూల్ ఉందని, అయినా కూడా అక్కడ రెడిమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, దీనివల్ల వాతావరణ కాలుష్యం జరుగుతోందని, పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఐదుగురికి నోటీసులు..

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌, జస్టిస్‌ రేణుక ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించింది. ఐదుగురు ప్రతివాదులకు కోర్టు నోటీసులు ఇచ్చింది. సికిందర్ ఖాన్, సలాబత్ ఖాన్, పల్లవి, బండి బిందు, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి.. ఈ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో కబ్జాకు గురైన భూమి లొకేషన్‌, సర్వే నెంబరు వివరాలతో హైడ్రాకు తాజాగా రిప్రజెంటేషన్‌ ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు