మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..! అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు..!

తెలంగాణలో మహిళలపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. మహిళలు ఏకంగా చట్ట సభల్లో కూర్చొనే అవకాశం వస్తున్నట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 50 సీట్లు వస్తాయని తెలిపారు. మరో పది కలిపి 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పకనే చెప్పారు.

 

రాజేంద్రనగర్‌‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో సోమవారం వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటారు ముఖ్యమంత్రి. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతి మహిళ తమ తమ ఇళ్లలో రెండు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.

 

మొక్కలు నాటడంతో మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయని, మహిళళకు 50కు పైగా సీట్లు వస్తాయన్నారు. తాను ప్రత్యేక చొరవ తీసుకొని మరో పది కలిపి 60 సీట్లు మహిళలకు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పుకొచ్చారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత తనదేనన్నారు.

 

ఇంటిని అద్భుతంగా నడిపే ఆడబిడ్డలు, రాజ్యాన్ని నడుపుతారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రకృతిని మనం కాపాడితే.. ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పారు సీఎం. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపు నిచ్చారని, అమ్మలు కూడా పిల్లల పేరుతో మరో మొక్క నాటాలన్నారు.

 

ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు సీఎం రేవంత్. మీ పిల్లలు వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెబుతూనే, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించామన్నారు.

 

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండే చోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని, పట్టణ ప్రాంతాల్లో మహిళలు పొదుపు సంఘాల్లో చేరాలన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించామని, అన్ని రంగాల్లో వారిని ముందు భాగంలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు