జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ టికెట్ ఎవరికంటే..?

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ టూర్.. టీ కాంగ్రెస్‌లో జోష్ నింపినట్లే కన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ లీడర్లకు దిశా నిర్దేశం చేయడం, పదవుల పందేరానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నేతల్లో ఉత్సాహాన్ని అమాంతం పెంచిందట. ఇక, సామాజిక న్యాయ సమరభేరి సభ సక్సెస్‌తో హస్తం నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారట.

 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఖర్గే మీటింగ్ సక్సెస్ జోష్

 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఖర్గే మీటింగ్ సక్సెస్ జోష్ కన్పిస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సామాజిక న్యాయ సమరభేరి సభ అనుకున్నదాని కంటే ఎక్కువగా సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌ గౌడ్ ఫుల్ ఖుషీగా ఉన్నారట.

 

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా..

 

తెలంగాణలో ఇప్పటికే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి వేళ పార్టీని మరింతగా బలోపేతం చేస్తే మరోసారి ఈజీగా అధికారంలోకి రావచ్చని భావిస్తోందట హస్తం అధిష్టానం. ఇందులో భాగంగా ఇటీవలె హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. హస్తం పార్టీ అమలు చేస్తున్న సామాజిక న్యాయ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సభ ఊహించిన దానికంటే ఫలితాన్నిచ్చింది. ఇంకా చెప్పాలంటే గ్రామస్థాయి నేతలతో నేరుగా ఏఐసీసీ చీఫ్ సమావేశం కావడమే కాంగ్రెస్ చరిత్రలోనే తొలిసారి అని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

 

ప్రణాళికలు రూపొందిస్తున్న హైకమాండ్

 

ఈ సభ వేదికగా ఖర్గే.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన మాటల తూటాలు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయన్న టాక్ విన్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ మీటింగ్‌ సక్సెస్ కావడంలో కీలక పాత్ర పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌దేనని చెప్పాలి. ఓ ప్రణాళిక ప్రకారం గ్రామస్థాయి నాయకులను ఎల్బీ స్టేడియంకు తరలించడంలో ఆయన ముందున్నారని పార్టీ శ్రేణులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే

 

కేవలం ఇదే కాదు.. కాంగ్రెస్ పార్టీ అఫైర్స్ కమిటీలో జరిగిన చర్చ సైతం హస్తం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందట. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతోపాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్న ఈ భేటీలో వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు ఖర్గే. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు పలు సూచనలు చేశారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బాగా పనిచేశారని.. ఇప్పుడు వారి కోసం మంత్రులు సైతం పనిచేయాల్సిందేనని చెప్పారట ఖర్గే. గ్రామస్థాయి నుంచి పార్టీ బలంగా ఉన్నప్పుడే ఎక్కువ కాలం అధికారంలో ఉండేందుకు వీలవుతుందని దిశానిర్దేశం చేశారాట మల్లికార్జున ఖర్గే.

 

ప్రజలతో మమేకమయ్యే వారికే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్

 

ఇక, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందేనని తేల్చి చెప్పారట మల్లికార్జున ఖర్గే. ఇందుకోసం రేసులో ఉన్న అభ్యర్థులపై వివిధ రకాల సర్వేలు చేయించాలని సూచించారాట. పార్టీ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ మైలేజ్ కలిగిన వారికే టికెట్ కేటాయిస్తామని క్లారిటీ ఇచ్చారట. అంతేకాదు.. ప్రజలతో మమేకమైన వారికే ఛాన్స్ అని నాయకులతో అన్నారట ఖర్గే. ఇదే సమయంలో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని సూచించారట ఏఐసీసీ అధ్యక్షులు. పార్టీ తీరుకు విరుద్దంగా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారట ఖర్గే. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు, నేతల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారట. కొంత మంది ఎమ్మెల్యేలు గ్రూపులు కడుతూ పార్టీ విలువల్ని దెబ్బతీస్తున్నారని.. ఇలాంటి వాటికి ఏఐసీసీ ఎట్టి పరిస్థితుల్లో భయపడబోదని తేల్చిచెప్పారట ఖర్గే. పార్టీ నాయకులు, కేడర్ మధ్య ఎవరైనా అపోహలు సృష్టిస్తే సహించేది లేదని స్పష్టం చేశారట.

 

నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఖర్గే

 

ఇప్పటికే పదవులు పొందిన నేతలు మరింత ఫోకస్‌గా పనిచేయాలని సూచించారట ఖర్గే. అంతేకాదు.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని సూచించారట. వీటితోపాటు మార్కెట్ కమిటీలు, ఆలయాల పాలక మండళ్లు సహా ఉన్న అన్ని పదవులను భర్తీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారట. మొత్తంగా రెండు రోజులపాటు హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన సూచనలు, ఇచ్చిన సలహాలు, చేసిన దిశానిర్దేశం అన్నీ పార్టీ మరింతగా ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారట హస్తం నేతలు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు