ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ, తెలంగాణ‌ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తుది ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన సమయంలో.. ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.

 

ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది.

 

ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించ‌డం వ‌ల్ల‌ మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు రాష్ట్రాల‌లో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధ‌న‌లు భిన్నంగా ఉంటాయ‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది.

 

జమ్మూకశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిసారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్మూకశ్మీర్‌ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం.. ఏకపక్షం, విపక్షం కాదని చెబుతూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు