వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.205 కోట్ల నిధులు విడుదల..

రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో రేవంత్ సర్కార్ కీలక ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో.. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషనల్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టలేషన్ వంటి నిర్మాణాలు చేపట్టనున్నారు.

 

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం గతంలో కొన్నేళ్ల క్రితం మూసివేతకు గురైన విషయం తెలిసిందే. దాని పునరుద్ధించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ విమానాశ్రయ పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అదనంగా 253 ఎకరాలు అవసరమని మార్చి నెలలో గుర్తించింది. ఈ భూసేకరణ ప్రక్రియలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన భూములను గుర్తించిన సంగతి తెలిసిందే.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జీఎంఆర్ సంస్థ విధించిన 150 కిలోమీటర్ల దూర నిబంధన సడలించడంతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగాయి. ఈ విమానాశ్రయం A-320 రకం విమానాల కోసం ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్ (ఐఎఫ్ఆర్) సామర్థ్యాలతో అభివృద్ధి చేస్తున్నట్టు AAI ప్రణాళికలు సిద్ధం చేసింది.

 

ఈ నిధులతో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. 30 నెలల్లో టెర్మినల్స్, రన్‌వే విస్తరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి వరంగల్‌ నగరాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారు. అదనంగా, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం పరిశ్రమల విస్తరణకు, రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదపడనుంది. హైదరాబాద్‌తో కనెక్టివిటీ కోసం నాలుగు లేన్ల రోడ్డు ప్రతిపాదనలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.

 

వరంగల్ విమానాశ్రయం రాకతో.. జిల్లా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఉపాధి అవకాశాలను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. మెరుగైన విమాన ప్రయాణ సౌకర్యాలు వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతాయి. జిల్లాను పరిశ్రమలు, వ్యాపారాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు