- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వార్-2
- హైదరాబాదులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
ది హైదరాబాద్ మీడియా
తన తాత, దివంగత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘వార్ 2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘వార్ 2’ సినిమా చేయడానికి కథ ప్రధాన కారణం కాదు. నిర్మాత ఆదిత్య చోప్రా గారు ‘నువ్వు ఈ సినిమా చేయాలి, నీ అభిమానులు గర్వపడేలా తీస్తాను’ అని నాకు మాట ఇచ్చారు. కేవలం ఆ మాటను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను’’ అని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు అయాన్ ముఖర్జీకి, యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సహనటుడు హృతిక్ రోషన్‌పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్‌లోనే గొప్ప నటుడు, డ్యాన్సర్ హృతిక్ రోషన్. 25 ఏళ్ల క్రితం ‘కహోనా ప్యార్ హై’లో ఆయన డ్యాన్స్ చూసి మంత్రముగ్ధుడినయ్యాను. అలాంటి వ్యక్తితో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇది తన హిందీ సినిమా మాత్రమే కాదని, హృతిక్ చేస్తున్న తెలుగు సినిమా కూడా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.








