ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’..!

ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.

 

ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లోని ప్రజలు కూడా ఈ ఖగోళ వింతను చూసే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలించి, ఆకాశం నిర్మలంగా ఉంటే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల నుంచి ఈ రక్త చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువసేపు, ఇంత విస్తృతంగా కనిపించే చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం.

 

అసలు చంద్రగ్రహణం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందనే సందేహం చాలా మందికి కలుగుతుంది. సూర్యుడికి, చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడుతుంది. అయితే, సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించి, వంగి చంద్రుడిపై పడుతుంది. ఈ ప్రక్రియలో నీలి రంగు కాంతి వాతావరణంలో ఎక్కువగా చెదిరిపోతుంది. కేవలం ఎరుపు, నారింజ రంగుల కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని చేరతాయి. దీనివల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ఖగోళ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు