కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

 

ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. అప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వలేమని కూడా కోర్టు తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున, సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అసెంబ్లీ తీర్మానం చేసిన మరుసటి రోజే (ఈరోజు) కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రేపు జరగనున్న హైకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు