కాళేశ్వరంపై కుట్ర.. నీళ్లన్నీ ఆంధ్రాకే: కేటీఆర్..

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం అంటే, దానిని పూర్తిగా మూసివేయడమేనని అన్నారు. “ఇది కేవలం కేసీఆర్‌పై జరుగుతున్న దాడి కాదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి, కాళేశ్వరాన్ని ఎండబెట్టి, మన నీటిని పక్క రాష్ట్రాలకు తరలించే పెద్ద కుట్ర” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఈ కపట నాటకం ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీల కుట్రలను సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

 

నిన్నటి వరకు సీబీఐని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఒక్కరోజులోనే మాట మార్చడం వెనుక ఉన్న శక్తులు ఏంటో ప్రజలకు తెలియాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతోందని ధ్వజమెత్తారు. తమకు కేసులు, విచారణలు కొత్త కాదని, ఏ ఏజెన్సీతో విచారణ జరిపించినా భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, ఈ కుట్రలను ప్రజల ముందు ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు