దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’ఈసీ..!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే–ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం.. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘాల ప్రధాన అధికారులతో దేశ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మరికాసేపట్లో భేటీ కానున్నారు. బీహార్ లో ఇటీవల ఈ సర్వే చేపట్టి ఓటర్ జాబితాలో పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సర్వే చేపట్టడంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈసీ చర్య రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం సమర్థించింది.

 

రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులతో జరగనున్న సమావేశంలో ఈసీ సీనియర్‌ అధికారులు ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. బీహార్‌ లో ఈ విధానాన్ని అమలు చేసిన తీరును ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించనున్నారు. అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. వచ్చే ఏడాది తమిళనాడు, బెంగాల్‌, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు