విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త రూల్..! ఇక పై సౌండ్ రావాలి..

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వల్ల పొంచి ఉన్న నిశ్శబ్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈవీల నుంచి కూడా శబ్దం వచ్చేలా ‘అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్’ (AVAS)ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.

 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు ఈ సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా, 2026 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే కొత్త మోడల్ వాహనాల్లో ఈ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేసింది.

 

ఎందుకీ నిర్ణయం?

 

సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల్లా కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నప్పుడు ఎలాంటి ఇంజిన్ శబ్దం రాదు. దీనివల్ల పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారు, ఇతర వాహనదారులు వాటి రాకను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఈ ఏవీఏఎస్ సిస్టమ్, వాహనం కదులుతున్నప్పుడు ఒక కృత్రిమ శబ్దాన్ని సృష్టిస్తుంది. వాహనం వేగానికి అనుగుణంగా ఈ శబ్దం తీవ్రత కూడా మారుతూ, అచ్చం ఇంజిన్ శబ్దంలాగే ఉంటుంది. ఏఐఎస్-173 ప్రమాణాలకు అనుగుణంగా 56 నుంచి 75 డెసిబెల్స్ మధ్య శబ్దం వచ్చేలా దీన్ని రూపొందించనున్నారు.

 

ప్రస్తుతం ఈ నిబంధన ముసాయిదా దశలో ఉందని, దీనిపై ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఇచ్చారు. అమెరికా, ఐరోపా దేశాల్లో ఇప్పటికే ఇలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు