కొత్త పార్టీ ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు..! ఏమన్నారంటే..?

కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు. లండన్‌లోని తెలంగాణ ప్రవాసులతో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలన్నదే తన సంకల్పమని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు.

 

ప్రజల జీవితాల్లో మార్పు తేవడంపై తమకు స్పష్టమైన ఆలోచన ఉందని కవిత అన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, తనకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని కవిత అన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు. ఇక బీజేపీ డీఎన్ఏ తనకు సరిపడదని తెలిపారు.

 

20 ఏళ్లు పార్టీ కోసం పని చేశాను

 

ఇరవై ఏళ్లు పార్టీ కోసం పని చేశానని కవిత తెలిపారు. కొందరిలో స్వార్థం పురుడుపోసుకుందని, వారి వల్ల కోట్లాది మంది బాధపడవద్దనే తన తపన అన్నారు. పార్టీలో చీలికలు రావొద్దనే ఎంతటి ఇబ్బందినైనా తట్టుకొని నిలబడ్డానని, పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయని ఆమె ఆరోపణలు చేశారు.

 

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ తర్వాత మాట్లాడవలసి వచ్చిందని కవిత అన్నారు. పార్టీ తనను వద్దుకున్నదని, అందుకే పార్టీ ఇచ్చిన పదవిని వదులుకున్నానని కవిత అన్నారు. కష్టమవుతుందని తెలిసినా కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా పంథాను ఎంచుకుంటానని కవిత అన్నారు. జైలు జీవితం తనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని కవిత అన్నారు. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు