అనకాపల్లి, ఫిబ్రవరి 28 : వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కడా తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. పింఛన్ల పంపిణీ, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ, ప్రజా సర్వే, ఎం ఎస్ ఎం ఇ పార్క్ ల ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1వ తేదీన పింఛన్ల పంపిణీ జరగాలన్నారు. ఉదయం 7 గంటల నుండి ఫించన్ల పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన సూచించారు. మొదటి రోజే శత శాతం పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలన, మిగిలిన పింఛన్ల పంపిణీని 3వ తేదీన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పించనుదారులతో మర్యాద పూర్వకంగా మసలుకోవాలని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఎక్కడా తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళిక రూపొదించుకోవాలని ఆదేశించారు. మంచినీరు కలుషితం కాకుండా నీటి సరఫరాలో అత్యంత జాగ్రత్త వహించి, నీటి నాణ్యతలో లోపాలు లేకుండా చూడాలని ఆయన చెప్పారు. అతిసార, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నీరు, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. వసతిగృహాలలో మంచినీరు, ఆహారం నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సర్వే మార్చి 15నాటికి పూర్తిచేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వేసవిలో మంచినీటి సరఫరాలో యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక తయారుచేయాలని గ్రామీణ నీటి సరఫరా అదికారులను ఆదేశించారు. ఎమ్ ఎస్ ఎమ్ ఇ మార్చి 15 నాటికి పూర్తిచేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.వి.నాయుడు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజరు జి. నాగరాజారావు, గ్రామీణ నీటి సరఫరా జిల్లా ఇంజనీరింగు అధికారి ఎ.ఎస్.ఎ. రామస్వామి, జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటరు జిల్లా కో ఆర్డినేటరు ఇ. నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








