అనకాపల్లి (కె.కోటపాడు) మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు మరియు మెగా జాబ్ మేళాలను నిర్వహించటం వలన స్థానిక నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. శనివారం కె. కోటపాడు లోగల శ్రీ అయ్యన్న డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్యఅతిదిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వారికి నచ్చిన కంపెనీకి ఇంటర్యూకు హాజరై, ఉద్యోగం పొందాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్థానికంగానే కాకుండా ఎక్కడ జాబ్ వస్తే అక్కడ జాయిన్ అయి ఆ ఆదాయంతో కుటుంబాన్ని తీర్చిదిద్దగలరని నిరుద్యోగ యువతీ యువకులను ఉద్దేశించి తెలిపారు. ఈరోజు జరిగినటువంటి ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందవద్దని, ఈరోజు నిర్వహించిన ఇంటర్వ్యూ అనుభవంతో భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొందుటకు అవకాశం కలదని తెలిపారు. లారస్ కంపెనీలో కొన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని తెలియ చేశారని దానికి సంబంధించి ఎవరైనా బయోడేటాలు ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ కంపెనీ లో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లా నైపుణ్య అభివృద్ధి అదికారి గోవిందరావు మాట్లాడుతూ ఈరోజు జరిగినటువంటి జాబ్ మేళాకు సుమారుగా 18 బహళ జాతీయ కంపెనీలు హాజరయ్యాయని అలాగే 1300 ఖాళీలు వివిధ కంపెనీలో ఉన్నాయని మరియు ఈరోజు జరుగుతున్నట్టు ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుండి పీజీ వరకు అలాగే ఐటి, డిప్లమో, బీటెక్, బి బి ఏ, ఎం బి ఏ, బి ఏ, బీకాం, బీఎస్సీ కి సంబంధించి ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికంగా కానీ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా ఉద్యోగ అవకాసం పొందినటువంటి వారు నియామకం పత్రం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని, అది దూరమా దగ్గర అని చూడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
ఈ రోజు జాబ్ మేళాలో 18 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొని 425 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరుకాగా 172 మంది వివిధ కంపెనీ లకు ఎంపిక కావటం జరిగిందని, సుమారు 70 మందికి ఉద్యోగ మేళా నిర్వహించిన చోటే ఉద్యోగ నియామక పత్రాలు అందిచటం జరిగిందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అదికారి తెలిపారు.

ఈ కార్యక్రమం లో కాలేజీ కారస్పాండెంట్ ఖాసీం, కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.








