అనకాపల్లి, మార్చి 31: అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని, రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారందరికీ న్యాయం చేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోమవారం సాయంత్రం అచ్యుతాపురం జంక్షన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చుతాపురం నుండి అనకాపల్లి నాలుగు వరుసలు రహదారి నిర్మాణం పనులను రాష్ట్ర విద్యా మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా తీర్పు వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంపుదల అమలుచేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందచేయడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్, ఉచిత గ్యాస్ పంపిణీ అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ సమయంలో రోడ్లకు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గుంతల మయమయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టి రహదారులను బాగు చేయడం జరిగిందన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అచ్చుతాపురం నుండి అనకాపల్లి రోడ్డును నాలుగు వరసల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన ప్రజలందరికీ న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ చేయడం జరుగుతుందని, పరిశ్రమలు రావడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి సహకారంతో ఎన్టిపిసి గ్రీన్ పార్క్ మొదలైన పరిశ్రమలు స్థాపించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని, గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, క్రమశిక్షణతో మెలగాలని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ అచ్చుతాపురం నుండి అనకాపల్లి రోడ్డు ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఎంతో కీలకమని తెలిపారు. రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. భవిష్యత్తులో ఆర్సి మిట్టల్, హైడ్రోజన్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పరిశ్రమలు నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్లు విస్తరణ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పరిశ్రమల ద్వారా రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్తులో ఐదు లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులతో స్థాపించబోయే పరిశ్రమల ద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ సుమారు 14 కిలోమీటర్ల రోడ్డును 243 కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించడం జరుగుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణ ద్వారా ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పనులు మంజూరులో సహకరించిన మంత్రులు, శాసనసభ్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పనులు పూర్తి చేయుటకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమం లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత,
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కె ఎస్ ఎన్ రాజు, పల్లా శ్రీనివాస రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, ఇతర నాయకులు, అధికారులు హాజరయ్యారు.








