నువ్వులలో నాణ్యమైన దిగబడులు.

సమగ్ర యాజమాన్య పద్ధతులతో లాభదాయకం.

నువ్వు పంటలో క్షేత్ర దినోత్సవం.

నూనె గింజల స్వయం సమృద్ధికై కృషి.

అనకాపల్లి:సమగ్ర యాజమాన్య పద్ధతులను, సరైన సమయంలో పాటించడం ద్వారా నువ్వులలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు అని నిరూపితమైందని జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్ రావు అన్నారు. మంగళవారం దిబ్బపాలెం గ్రామంలో బీసీటీ-కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో… నువ్వు పంటపై నిర్వహించిన క్షేత్ర దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పంటకి నిర్దేశించిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వచ్చే దిగుబడికి ఇదే సాక్ష్యం అని, సుమారు నాలుగు క్వింటాళ్ల పైనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అలాగే వచ్చే తొలకరి కాలంలో, అన్ని రకాల ధాన్యాలు, పప్పు గింజలు, నూనె గింజలు కలిపి ప్రతి రైతు తన పొలంలో చల్లుకోవడం ద్వారా, అన్ని రకాల పోషకాలు నేలకు అందుతాయని, ఈ పద్ధతిని ప్రతి రైతు పాటించాలని కోరారు.

బిసిటి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ కుర్రా మాట్లాడుతూ … కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో, నూనె గింజల పంటల ఆదర్శ గ్రామంగా దిబ్బపాలెం మరియు వెంకుపాలెం గ్రామాలను మన మండలంలో ఎంపిక చేయడమైనదని, ప్రతి ఒక్క రైతు చేత నువ్వు, వేరుశనగ ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా సాగు చేయించడం అయినదని తెలియజేశారు. నూనె గింజలలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యమని అన్నారు.

నూనె గింజల పంటలలో రైతు స్థాయిలో జరుగుతున్న పొరపాట్లను, మరియు సరైన యాజమాన్య చర్యలను భూసార శాస్త్రవేత్త బుర్ల శ్రీహరి రావు వివరించారు.

దత్తత గ్రామంగా ఎంపిక చేయడం చాలా ఆనందదాయకమని, భవిష్యత్తులో కూడా రైతులకు అన్ని రకాలుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ పీలా ఉషా అప్పారావు కోరారు. అందరూ వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులే ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

గ్రామంలో సుమారు 152 మంది రైతులకు నువ్వులు అందజేశామని, మిగతా రైతులందరికీ వేరుశనగ మరియు ప్రొద్దు తిరుగుడు విత్తనాలు జనవరిలోనే అందజేశామని, ప్రస్తుత ఈ పంటలన్నీ కోత దశలో ఉన్నాయని సస్య రక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ వివరించారు.
కార్యక్రమంలో భాగంగా రైతు బొద్దపు భవాని గోవిందు పొలంలో పంట కోత ప్రయోగాన్ని నిర్వహించి మొక్కల సాంద్రత, కాయల సంఖ్య మరియు దిగుబడి శాతాన్ని లెక్కించారు.

గ్రామంలోని సుమారు 120 మంది రైతులతో పాటు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారిణి శ్రీమతి తులసీమణి, గ్రామ వ్యవసాయ సహాయకులు గణేష్, ప్రకృతి వ్యవసాయ రైతులు విల్లూరి వీరు నాయుడు, విల్లూరి శ్రీను, మల్ల నాగేశ్వరరావు, స్వాతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు