అంతర్జాతీయంగా వేగంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న బ్రిక్స్ కూటమి మరింత విస్తరించింది. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సులో ఇండోనేషియా పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ పరిణామం బహుళపక్ష వేదికలపై భారత్ పెరుగుతున్న దౌత్యపరమైన పలుకుబడికి నిదర్శనమని విదేశాంగ శాఖ (MEA) పేర్కొంది.
ఈ సదస్సు వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు) దమ్ము రవి మీడియాకు వెల్లడించారు. “సదస్సులో తనకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే బ్రిక్స్ కూటమిలో పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరిన ఇండోనేషియా అధ్యక్షుడికి స్వాగతం పలికారు” అని దమ్ము రవి వివరించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఎంతో విలువైనదిగా భావించారని ఆయన తెలిపారు.
ఈ చేరికపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా స్పందించారు. ‘సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ సవాళ్లపై సభ్య దేశాల నేతలతో అభిప్రాయాలు పంచుకున్నట్లు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఆర్థిక, సాంకేతిక, విద్యా రంగాల్లో జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, న్యాయమైన ప్రపంచ సహకారానికి ఇండోనేషియా కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని దమ్ము రవి పేర్కొన్నారు. వ్యవస్థాపక సభ్యదేశమైన భారత్ పాత్రను సదస్సులో ప్రత్యేకంగా గుర్తించారని తెలిపారు. ఈ సదస్సులో 11 శాశ్వత సభ్యదేశాలు, 9 భాగస్వామ్య దేశాలు, 8 ఆహ్వానిత దేశాలు, 7 అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొనడం బ్రిక్స్ పెరుగుతున్న ప్రాముఖ్యతను సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.