తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ నెల 13న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22న చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 24. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తెలంగాణతో పాటు జమ్ము కశ్మీర్, ఒడిశా, ఝార్ఖండ్, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు, ఫలితాలు ఒకే రోజు వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు.








